Telugu Prayers


అనుదిన ప్రార్ధనలు

స్లీవ గురుతు


పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.

పరలోక జపము


పరలోక మందు౦డెడు మా యొక్క తండ్రీ! మీ నామము పూజింపబడునుగాక! మీ రాజ్యము వచ్చునుగాక! మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, భూలోకమందు నేరవేరునుగాక! నానాటికి కావలసిన మా యన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యెద్ద అప్పుపడినవారిని మేము మన్నించునట్లు, మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింప నివ్వక కీడులోనుండి మమ్ము రక్షించండి. ఆమెన్.

మంగళవార్త జపం 


దేవ వరప్రసాదముచేత నిండిన మరియమ్మా! వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడినవారు ఆగునే. పరిశుద్ద మరియమ్మా! సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును, మా మరణ సమయమందును ప్రార్ధించండి. ఆమెన్.

త్రిత్వస్తోత్రం 


పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు మహిమ ఆదిలోవలె ఇప్పుడును, ఎల్లపుడును కలుగునుగాక. ఆమెన్.

త్రికాల జపము 


ఒకరు: ఏలినవారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను అందరు: ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించెను (1 మం) 
ఒకరు: ఇదిగో, ఏలినవారి దాసురాలను అందరు: నీ మాట చొప్పున నాకు అగునుగాక (1 మం)
ఒకరు:పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యావతారమెత్తెను అందరు: మరియు మనతోకూడ వాసమైయుండెను (1 మం) 
ఒకరు:యేసు క్రీస్తునాధుని వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు అందరు: సర్వేశ్వరుని పరిశుద్ధమాతా! మా కొరకు ప్రార్ధించండి.

ప్రార్ధించుదము: సర్వేశ్వరస్వామి! సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుష్యావతారమును తెలిసికొంటిమి! వారి పాటుల వలనను, స్లీవవలనను, ఉత్తానమహిమను మేము పొందునట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయనవధరింపవలయునని దేవరవారిని వేడుకొనుచున్నాము. యేసు క్రీస్తునాధుని దివ్యముఖమును జూచి, ఈ మనవినిమాకు దయచేయండి. ఆమెన్.

ఉదయకాల ప్రార్ధన 


పరలోక భూలోకమును అందలి సమస్తమును సృష్టించి కాచి కాపాడు తండ్రీ! గడచిన రాత్రి నన్ను సకల అపాయములనుండి కాచి కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాను. మీరు నా కొసగిన ఈ నూతన దినమును మీ కుమారుని వ్యాక్యానుసారము జీవించుటకు తగు వరప్రసాదములను నాకు ప్రసాదించండి. నేను నాతోటివారిని ప్రేమించుచూ మీ ప్రేమలో జీవింప అనుగ్రహించండి. నేను ఎక్కడ ఉన్నను ఏమైనను మీ కుమారునికి ప్రియమైన శిష్యునిగా జీవించుచూ ఆయన నామమునకు సాక్షిగానుండు భాగ్యము నాకు దయచేయండి. మీ కుమారుని వ్యాక్యానుసారము జీవించి నా మరణానంతరము ఆయన పునరుత్థాన మహిమలో పాలివాడనగు గొప్ప అవకాశము నాకు అనుగ్రహించండి తండ్రీ! ఆమెన్.

ప్రాత:కాల జపము


స్వయంభువు, అనాది, అశరీరి, మితిలేని సకల మేలుల స్వరూపి, జ్ఞానము, బలిమి కారణములచేత సర్వవ్యాప్తి; సర్వమునకు మూల కారణమైన పిత, పుత్ర, పవిత్రాత్మ యనెడు ఏక త్రిత్వ సర్వేశ్వరా! మిమ్ము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగినవారు మీరే! :
సదాకాలము మీ తిరునామము స్తుతింపబడునుగాక.
దయాసముద్రమై యుండెడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములను తలంచి మేలెరిగిన స్తోత్రము చేయుదుముగాక. సర్వేశ్వరా! తమరు నాయాత్మ శరీరములను ఏమిలేమినుండి సృష్టించి, నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేసితిరే! : స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
దేవా ఈ రాత్రియందు ఒక్క అపాయమునైనను కలుగకుండ నన్ను కాపాడితిరే! : స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
దేవా! జ్ఞానస్నానము ద్వారా నన్ను తిరుసభలోచేర్చి మీ బిడ్డనుగా జేసికొని, జేసు పవిత్ర మరణముచేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగ్యునిగా చేయనవధరించితిరే! : స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
దేవా! నా పాపకార్యములకు నన్ను నరకమున త్రోసివేయక, పాపసంకీర్తనము ద్వారా నను ఓర్చి నాకు సత్ప్రసాదమనెడి దివ్య భోజనము ప్రసాదింప నవధరించితిరే! స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
దేవా! నేను ఎన్నియో ద్రోహములను చేసినను తల్లిదండ్రులవలె నన్ను కాపాడితిరే! స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
సర్వేశ్వరా! మీ ఏకైక కుమారుడైన జేసునాధుడు నా కొరకు అనేక పాటులననుభవించి స్లీవమీద కఠినమైన మరణము పొంద తమరు చిత్తగించితిరే! స్వామీ! మీకే స్తోత్రము కలుగును గాక.
సర్వేశ్వరా! మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారము యోగ్యునిగా ప్రవర్తించెదనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు, వాక్కు, క్రియలను, ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్లు నడిపించుకొనుటకు మీకు వశపరచుచున్నాను. నేను చేసెడు సత్క్రియలన్నింటిని జేసునాధుని పుణ్యఫలములతో దేవరవారిని చేకొనండి. వానివలన వచ్చెడు జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనస్సుగానున్నాను. ఆమెన్.
ఈ దినము మనకు ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొనుదుము. సకల కీడులనుండి, మమ్ము రక్షించండి స్వామీ!
సకల పాపములనుండి, మమ్ము రక్షించండి స్వామీ!
మీ కోపాగ్నినుండి, మమ్ము రక్షించండి స్వామీ!
ఆకస్మికమైన, ఆయత్తము లేని మరణము నుండి, మమ్ము రక్షించండి స్వామీ!
పిశాచి తంత్రములనుండి, మమ్ము రక్షించండి స్వామీ!
కోపము, పగ మొదలైన దుర్గుణములనుండి , మమ్ము రక్షించండి స్వామీ!
మొహాగ్ని నుండి, మమ్ము రక్షించండి స్వామీ!
పిడుగులు, ఘోర గాలి మొదలైన వానినుండి, మమ్ము రక్షించండి స్వామీ!
భూకంపమునుండి, మమ్ము రక్షించండి స్వామీ!
అంటురోగము, కరువు యుద్ధము మొదలైన వాని నుండి, మమ్ము రక్షించండి స్వామీ!
నిత్య మరణమునుండి, మమ్ము రక్షించండి స్వామీ!
దేవరవారి మనుష్యావతార పరమ రహస్యమును జూచి, మమ్ము రక్షించండి స్వామీ!
దేవరవారి ఆగమనమును జూచి, మమ్ము రక్షించండి స్వామీ!
దేవరవారి జన్మమును జూచి, మమ్ము రక్షించండి స్వామీ!
దేవరవారి తపోస్నానము, ఉపవాసమును జూచి, మమ్ము రక్షించండి స్వామీ!
దేవరవారి స్లీవను, పాటులను జూచి, మమ్ము రక్షించండి స్వామీ!
దేవరవారి మరణమును, భూస్థాపమును జూచి, మమ్ము రక్షించండి స్వామీ!
దేవరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును జూచి, మమ్ము రక్షించండి స్వామీ!
దేవరవారి మహిమ ప్రతాపముగల మొక్షారోహణమును జూచి, మమ్ము రక్షించండి స్వామీ!
ఓదార్చెడు పవిత్రాత్మయొక్క రాకడను జూచి, మమ్ము రక్షించండి స్వామీ!
న్యాయ నిర్ణయము జరిగెడు దినములలో, మమ్ము రక్షించండి స్వామీ!

దేవమాత శరణుగోరు జపము మిక్కిలి నెనరుగల తల్లి! మీ శరణుకోరి పరుగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారలలో ఒక్కరైనను మీ వలన చేయు విడువబడినట్టు ఎన్నడును లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞీ! దయారసముగల తల్లీ! ఇటువంటి నమ్మికచేత ప్రేరేపింపబడి, మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చేడు పాపియైన నేను మీ దయాళమునకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లీ! నా విజ్ఞాపమును త్యజింపక దయాపరియై విననవధరించండి. ఆమెన్. 

పితయైన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెగా నుండెడు కన్యమరియమ్మా! నాయందు దేవవిశ్వాసము అను పుణ్యము వర్దిల్లునట్లుగా మీ దివ్యకుమారుని వేడుకొనండి.
పుత్రుడైన సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ తల్లియైన కన్య మరియమ్మా! నాయందు దేవ నమ్మిక అను పుణ్యము వర్దిల్లునట్లుగా మీ దివ్యకుమారుని వేడుకొనండి. 
పవిత్రాత్మయైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మా! నాయందు దేవ ప్రేమ అను పుణ్యము వర్దిల్లునట్లుగా మీ దివ్యకుమారుని వేడుకొనండి. 
జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మా! పాపులకు శరనమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణుజొచ్చితిమి. మా కొరకు వేడుకొనండి. 
పరిశుద్ధ మరియమ్మా! ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయునట్లుగాను, నా యందుగల దుర్గుణములను, అణచునట్టుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్లుగాను, మిమ్ము మనవి చేయుచున్నాను. నా కొరకు వేడుకొనండి. 
పునీత జోజప్పగారా! మీరు బాల జేసువును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర కీడులనుండి కాపాడవలయునని మనవి చేయుచున్నాను.నా కొరకు వేడుకొనండి. 
నా కావలియైన సన్మనస్కుడా! దైవ కృపచేత మీకు ఒప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచియొక్క శోధనలో పడనియ్యక కాపాడి పుణ్యమార్గములో నడిపింపవలయునని మనవి చేయుచున్నాను. నా పాలక పునీతులారా! మీ వలె నేనును ఈ భూలోకములో సర్వేశ్వరుని తెలిసికొని, ప్రేమించి సేవించునటుల మిమ్ము మనవి చేయుచున్నాను. నా కొరకు వేడుకొనండి. 
సకల పునీతులారా! మీతో సర్వేశ్వరుని పరలోకములో దర్శించి స్తుతింప దేవ కృప నాకు దొరుకునట్లు మనవి చేయుచున్నాను. నా కొరకు వేడుకొనండి.  
సర్వశక్తుడును, దయాపరుడైన పిత, పుత్ర, పవిత్రాత్మయనెడు ఏక త్రిత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్. 

అపోస్తులుల విశ్వాస సంగ్రహము 


పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతనియొక్క ఏక పుత్రుడును మనయొక్క నాధుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై, పాటుబడి స్లీవమీద కొట్టబడి, మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి, మూడవనాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుండియున్నారు.అక్కడ నుండి జీవించువారలకును, చనిపోయిన వారలకును తీర్పుచేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరముయొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. 

మహిమ గీతము (గ్లోరియ) 


మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ఏలినవారైన సర్వేశ్వరా! పరలోక రాజా! సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా! మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము నారాధించుచున్నాము. మిమ్ము ఘనపరచుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా! ఏలినవారైన యేసుక్రీస్తువా! ఏలినవరైన సర్వేశ్వరా! సర్వేశ్వరుని గొర్రెపిల్లా! పితయొక్క పుత్రుడా! లోకము యొక్క పాపములను పరిహరించెడువారా! మాకు దయచూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడువారా! మా మనవి నాలకించండి. పితయొక్క కుడిప్రక్కన కూర్చొనియున్నవారా! మాకు దయచూపండి, ఏలయన, మీరొక్కరే పరిశుద్ధులు. మీరొక్కరే ఏలినవారు. మీరొక్కరే మహోన్నతులు. యేసుక్రీస్తువా! పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా! ఆమెన్. 

సంపూర్ణ రక్షణ కోరు ప్రార్ధన 


యేసు ప్రభూ! మీ రక్షణ ఫలితము ద్వారా నన్నును, నా కుటుంబ సభ్యులను, నాకు ప్రియమైన వారిని, మీ పవిత్ర రక్తముతో అభిషేకించుమని మీ వరప్రసాదములతో నింపుమని వేడుకొనుచున్నాను. నా శిరస్సునుండి, అరికాళ్ళవరకు మీ పరిశుద్ధ రక్తముతో కడిగి శుభ్రపరచండి. ఓ దేవా! మా జీవితాలపై ఈ క్షణములో, మీ పరిపూర్ణ రక్షణ అత్యవసరం. యేసు ప్రభూ! పాపము, శోధన, పిశాచిఅవహము, కష్టాలు, చీకటి వలన మానవుల వలన భయము, రోగము, బలహీనత, అనుమానము, కరువు కాటకములు, ప్రమాదములు, మరణము మొదలగు కీడులనుండి, ముఖ్యముగా నీ రాజ్యమునకు చెందని దుష్టశక్తులన్నింటినుండి మమ్ము సంరక్షించండి. 
ఓ యేసుదేవా! మీ పవిత్రాత్మతో మమ్ము నింపి, జ్ఞానము, బుద్ధి, విశ్వాసము, విమర్శ, సదాలోచన, దైవ భయము, భక్తి అనువరములను ప్రసాదించండి. తద్వారా, మేము మీ యిష్ట ప్రకారము నడచుకొంటూ, మంచిని మాత్రమేచేయు వ్యక్తులముగా మమ్ముమలచండి. 
యేసు ప్రభూ! మీకే స్తుతి! 
యేసు ప్రభూ! మీకే వందనం. 
యేసు ప్రభూ! మిమ్ము ప్రేమిస్తున్నాను. 
యేసు ప్రభూ! మిమ్ము ఆరాధిస్తున్నాను. ఆమెన్. 

అతిదూతయగు పునీత మిఖయేలు గారికి ప్రార్ధన 


అతి దూతయగు పునీత మిఖయేలా! స్వర్గ సైన్యములకధిపతీ! ఈ అంధకార ప్రపంచమున, ఉన్నత స్థలములో ఉన్న దుష్టశక్తులను, బలవంతులనెదుక్కొనుచూ, మేము జరుపుచున్న పోరాటములో మాకు తోడుగా ఉండండి. దేవుని పోలిక గలిగి ఆయన వెలలేని రక్తము వలన పాప దాస్యమునుండి విముక్తులైన మానవులు పిశాచి క్రూరత్వమునకు గురికాకుండునట్లు చేయండి. శ్రీసభ మిమ్ము తన సంరక్షకునిగ గౌరవించుచున్నది. క్రీస్తు రక్షణఫలము పొందిన ఆత్మలను మోక్షమునకు చేర్చు బాధ్యత ప్రభువు మీకప్పగించి యున్నారు. కనుక మమ్ము పిశాచి బంధించి శ్రీ సభకు హాని కలిగింపకుండుటకై మా పాదముల క్రింద దానిని నలుగ త్రొక్కుటకు శక్తిని ప్రసాదించండి. అతి దూతయగు పునీత మిఖయేలా! మా పోరాటములో మాకు తోడుగా ఉండండి. పిశాచి తంత్రములను పారద్రోలి మాకు రక్షణగా వుండండి. దేవుడు పైచాచిక శక్తులను అణచివేయునుగాక. స్వర్గ సైన్యములకధిపతియైనవారా! ఈ లోకమున ఆత్మలను నాశనముచేయుటకు గర్జించు సింహమువలె తిరుగుచున్న పిశాచిని, దాని సైన్యములను, నరకకూపములోనికి పడద్రోయమని మిమ్ము దీనతతో బ్రతిమాలు కొనుచున్నాము. ఆమెన్. 

సర్వేశ్వరుని ఆజ్ఞలు పది 


1. సర్వేశ్వరుని మాత్రమే అరాధించుదువు గాక. 2. సర్వేశ్వరుని నామమును వ్యర్ధముగా పలుకకయుందువుగాక. 3. సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధ పరచుదువుగాక. 4. తల్లి దండ్రులను గౌరవించుదువుగాక. 5. నరహత్య చేయకయుందువుగాక. 6. మోహ పాపములను చేయకయుందువు గాక 7. దొంగిలింపక యుందువు గాక 8. అబద్ద సాక్ష్యము పలుకకయుందువుగాక 9. మోహ తలంపులను తలంపక యుందువుగాక. 10. పరుల సొమ్మును ఆశింపక యుందువుగాక. ఈ పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలలో ఇమిడి యున్నవి: 1. సకల వస్తువుల కంటె సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాక. 2. నీవలె సమస్త జనులను ప్రేమించుదువుగాక. 

తిరుసభ కట్టడలు ఆరు 


1. ఆదివారములలో, అప్పు పండుగలలోను దేవుని వాక్యమును విని దివ్యపూజలో పాల్గొనవలెను. 2. పాపములోనున్నవారు మనోపరివర్తన పొంది వెంటనే పాపసంకీర్తనం చేయవలయును. సాధారణముగా నెలకోసారైన చేయవలయును. అధమ పక్షం సంవత్సరానికి ఒకసారైనా చేయవలయును. 3. పూజలో పాల్గొనిన విశ్వాసులు యోగ్యముగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించవలయును. ముఖ్యముగా, పాస్కకాలములో తప్పనిసరిగా స్వీకరించవలయును. 4. పతి శుక్రవారమందు క్రీస్తు శ్రమలు మరణము స్మరణ చేసికొని తగువిధముగా విశ్వాసులు తపోక్రియలు, త్యాగకృత్యములు చేయవలయును. 5. తల్లి శ్రీసభ నియమావళి ప్రకారం జ్ఞానవివాహమును విచారణ గురువును సంప్రదించి గుడిలో చేసికొనవలయును. 6. విచారణ పనులలో సహకరిస్తూ ముఖ్యముగా జబ్బుపడిన వారికి, అనాధలకు సేవచేయ మనసుకలిగి యుండవలెను. సంఘమునకు తోడ్పడవలెను. 

దివ్య సంస్కారములు ఏడు 


1. జ్ఞాన స్నానము 
2. భద్రమైన అభ్యంగము 
3. దివ్య సత్ప్రసాదము 
4. పాప సంకీర్తనము 
5. అవస్థ అభ్యంగము 
6. గురు పట్టము 
7. జ్ఞాన వివాహము 

రాత్రికాల ప్రార్ధన 


పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్. 
సమస్తమును క్రమము తప్పక నడిపించు సర్వశక్తిగల సర్వేశ్వరా! ఈ దినము మీరు నన్ను రక్షించి ఎనలేని కృపా వరములచే ఆశీర్వాదములచే తరింప జేసినందులకు మీకు కృతజ్ఞతలను చెల్లించుచున్నాను.

పునీత జోజప్ప గారికి జపము


తిరుకుటుంబము యొక్క పాలకులైన ఓ ప్రేమగల తండ్రీ! జోజప్పగారా! మా జీవిత కాలమంతయు మరి ముఖ్యముగా ఈ రాత్రియంతయు మమ్ము కాపాడి రక్షించండి. నేను మంచి మరణము పొంది మోక్షములో నిత్యానందము పొందుటకు సహాయపడండి. ఆమెన్. 

జపమాల - దేవరహస్యాలు 


''ప్రతిరోజు జపమాలను జంపించండి. ప్రార్ధించండి... ప్రార్ధించండి. పాపాత్ములకొరకు త్యాగాలు చేయండి. నేను జపమాల రాజ్ఞిని. నేను మాత్రమే మీకు సహాయపడగలను. చివరికి, నా నిష్కళంక హృదయం జయిస్తుంది''.--ఫాతిమా మాతా 'జపమాల' అనగా 'గులాబీపూలమాల'. మంగళవార్త జపమును జపించినప్పుడెల్ల, ఒక్కొక్క అందమైన గులాబీని మరియ తల్లికి ఇస్తున్నాము. ఒక జపమాలను జపించినప్పుడు ఒక అందమైన గులాబీ దండను మరియమ్మకు అర్పిస్తున్నాము. అది గులాబీకిరీటముగా మారి ఆమెశిరస్సును అలంకరిస్తుంది. గులాబీపువ్వుల రాణి. అలాగే, జపమాల ప్రార్ధన అన్ని ప్రార్ధనలకు గులాబీ వంటిది. కాబట్టి, జపమాల చాలా ముఖ్యమైన ప్రార్ధన. 'పవిత్ర జపమాల' ప్రార్ధన పరిపూర్ణమైన ప్రార్ధన. ఎందుకనగా, దీనిలో మనరక్షణ చరిత్ర ఇమిడియున్నది. జపమాలతో సంతోషరహస్యాన్ని, యేసు మరియతల్లి దు:ఖ, మహిమ రహస్యాలను ధ్యానిస్తున్నాము. మరియవలె ఈ జపమాల ప్రార్ధన చాలా మహోన్నతమైనది. అందరు కలసి చెప్పదగిన ప్రార్ధన. మంగళ వార్త జపమును జపించినప్పుడు, మరియమ్మను ఆహ్వానిస్తున్నాం. మన ప్రార్ధనను ఆమె ప్రార్ధనతో జతపరస్తుంది. చెడును జయించి మనలో శాంతిని నెలకొల్పుటకు జపమాల ఒక గొప్ప సాధనం. జపమాలలో మొత్తం 20 గురుతులు. ఐదు సంతోష దేవరహస్యాలు, ఐదు దు:ఖ దేవరహస్యాలు, ఐదు మహిమ దేవరహస్యాలు మరియు ఐదు వెలుగు దేవరహస్యాలు. 

సంతోష దేవరహస్యాలు



1. గబ్రియేలు దేవదూత కన్యమరియమ్మకు మంగళవార్తను వినిపించుట (లూకా 1:28)
పఠనము: లూకా 1:26-38

ఓ మరియమ్మ గారా! మీ ''అవును'' తో స్వర్గముయొక్క ద్వారాలను తెరచి యున్నారు. దేవునియొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగారు. మీరు కలకాలము ఆశీర్వదింపబడుదురు. మీ ప్రార్ధన మధ్యవర్తిత్వం పరలోకమున వినిపించును. నీవు దేవుని ప్రణాళికను అంగీకరించావు. తండ్రి దేవుడు మమ్ములను అడిగే ప్రతీ విషయములో మేము కూడా 'అవును' అని సమాధానము చెప్పుటకు మాకు సహాయము చేయండి. దైవ చిత్తానికి అణకువగా, విధేయతగా ఉండులాగున మాకు సహాయం చేయండి.




2. దేవమాత ఎలిశబెతమ్మను సందర్శించుట (లూకా 1:42)
పఠనము: లూకా 1:39-49

మరియమ్మ ఎలిశబెతమ్మను సందర్శించుటకు వెళ్లి యున్నది. సోదర ప్రేమ, పొరుగువారి ప్రేమ, తన గర్భములో మోస్తున్న దేవుణ్ణి తన బంధువుల దరికి తీసుకొని వెళ్ళింది. తండ్రీ! మరియవలె మేముకూడా క్రీస్తును ఇతరుల దరికి తీసుకొని వెళ్ళుటకు సహాయం చేయండి.





3. బెత్లేహేములో యేసు జన్మించుట (లూకా 2:7)
పఠనము: లూకా 2:6-12

సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము. రక్షకుడైన క్రీస్తు ప్రభువు జన్మించెను. దేవదూతలు 'మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగువారికి సమాధానము కలుగుగాక' అని స్తుతించిరి. మరియమ్మ, యోసేపు, గొల్లలు, జ్ఞానులు ఆయనను సాష్టాంగపడి ఆరాధించిరి. మనముకూడా మన హృదయాలలో దైవ సుతుడైన క్రీస్తును స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువును మిక్కిలిగా ప్రేమించుటకు మరియమ్మ ప్రార్ధనా సహాయాన్ని వేడుకొందాం.




4. బాలయేసు దేవాలయములో కానుకగా సమర్పించుట (లూకా 2:28)
పఠనము: లూకా 2: 22-35

ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును. ''రక్షకుడు అన్యులకు మార్గ దర్శకమగు వెలుగు; నే ప్రజలగు ఇస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు.'' అని సిమియోను దివ్యబాలున్ని హస్తములలోనికి తీసుకొని దేవుని స్తుతించెను. మరియతో ఇట్లనెను: ''ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది''. దైవ పిలుపును, ఆయన ప్రణాళికను అర్ధము చేసికోవడానికి, దేవుని స్వరమును శ్రద్ధగా ఆలకించాలి. సిమియోను ప్రవచనము తర్వాత మరియమ్మ హృదయములో భాదని అనుభవించింది, కాని, మౌనముగా దేవుని చిత్తాన్ని అంగీకరించింది.



5. దేవమాత కానకపోయిన బాలయేసును దేవాలయములో కనుగొనుట (లూకా 2:46)
పఠనము: లూకా 2: 41-51

మరియ యోసేపులు బాలయేసు తప్పిపోయాడని భావించారు. కాని వారే బాలయేసునుండి తప్పిపోయారని చెప్పడములో ఆశ్చర్యము లేదేమో! ఎందుకనగా, నిజముగా ఆయన తప్పిపోలేదు, కాని తండ్రి పనిమీద ఉండియున్నాడు. యేసు ప్రభువునుండి మనము ఎన్నిసార్లు దూరంయ్యామో, తప్పిపోయామో! తప్పిపోయిన ప్రతిసారి ఆయన మనకోసం వెదుకుతూనే ఉంటాడు. మన జీవిత కష్టాలలో, ప్రభువును కనుగొనడములో మరియు ఆయనను ఎప్పటికిని వదలకుండా ఉన్నప్పుడే, నిర్భయముగా ఉండగలము.




దు:ఖ దేవ రహస్యాలు




1. గేత్సేమని తోటలో యేసు మహా ఆవేదన పొందుట (మార్కు 14:35)
పఠనము: లూకా 22:44

యేసు తన ప్రార్ధనలో బలాన్ని, నమ్మకాన్ని కనుగొన్నాడు. స్వర్గమునుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచింది. మన బాధలలో యేసుయే మనలను ఒదార్చేవాడగును. మన కష్టాలలో మనమెందుకు వేదన చెందుతున్నాము? క్రీస్తులో బలమై ఉందాం. కష్ట సమయాలలో దేవునివైపు చూద్దాం. ఆయన చిత్తమును నెరవేర్చుటకు ప్రయత్నం చేద్దాం.





2. యేసును రాతి స్తంభానికి బంధించి కొరడాలతో కొట్టి హింసించుట (మార్కు 15:15)
పఠనము: మార్కు 15:15

యేసు శరీరముపై ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, ఎన్ని గాయాలు! శత్రువులు పరిహసించుచుండగా, అవమానపరుస్తుండగా కొడుతూ ఉండగా యేసు శరీరమునుండి ఎంత రక్తము నేలపై కారి ఉంటుందో! మన పాపాలకు పాశ్చాత్తాప పడుచూ, దైవ ప్రేమ కొరకు ప్రతీ అవమానాన్ని అంగీకరించుదాం.




3. యేసు తిరుశిరస్సుపై ముళ్ళకిరీటం పెట్టి, అదిమి కొట్టుట (మార్కు 15:17)
పఠనము: మత్తయి 27:27-31

యేసునాధుడు అనుభవించిన అగౌరవాన్ని, దౌర్జ్యాన్ని, అవమానాన్నిగూర్చి ధ్యానిద్దాం. ఆయన వస్త్రములను ఒలిచారు. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరసుపై పెట్టారు. ప్రభువు మనతో అంటున్నారు: మీ వేదనలలో అసహనము ఎందుకు? మీరు నన్ను ప్రేమించేది ఇలాగేనా? నా శ్రమల గూర్చి ధ్యానించి నిజమైన నిధిని పొందండి. ప్రభువు మనకొరకు ఎలా శ్రమలను పొందియున్నది ధ్యానిస్తూ, అవమానములను, వేదనలను అంగీకరించుటకు, మరియు సహనము అను వరము కొరకు ప్రార్ధన చేద్దాం.



4. యేసు సిలువను మోయుట (యోహాను 19:17)
పఠనము: లూకా 23:26-32

యేసు ప్రభుని ప్రేమ చాలా గొప్పది. మన కొరకు, ఇప్పుడైనా శిలువను మోయుటకు సిద్దముగా ఉన్నాడు. మన శిలువలను ఎత్తుకొని ఆయనను అనుసరించుదాం. కల్వరికొండకు సిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు, తల్లియైన మరియమ్మను చూసాడు. వారి కనుచూపులు కలసిన క్షణాలు ఎలాంటివో మనం ఊహించుకో గలమా? ఆ తల్లి హృదయం ఎంతగా తల్లడిల్లి ఉంటుందో! మన సిలువలను ఎత్తుకొను శక్తిని దయచేయ ప్రార్ధన చేయమని మరియ తల్లిని వేడుకొందాం



5. యేసు సిలువపై మరణించుట (లూకా 23:33)
పఠనము: యోహాను 19:25-27

మనం మరియతల్లికి దగ్గర కావాలని యేసు కోరుచున్నారు. పిల్లలవలె మన చేతులు ఆమె చేతిలో వేయాలనేది ప్రభువు కోరిక. పరలోక రాజ్ఞియైన మరియవైపు చూడాలని, ఆమెపై ఆధారపడాలని ప్రభువు ఆశిస్తున్నారు. ఓ మరియమ్మా! మా నమ్మకాన్ని మీపై ఉంచుతున్నాము. మీ నిష్కలంక హృదయములో మాకు శరణమివ్వండి. దేవుని నుండి దూరము చేసే గర్వాన్ని మా నుండి తొలగించండి.





మహిమ దేవరహస్యాలు




1. యేసు పునరుత్థానం అగుట (మార్కు 16:6 )
పఠనము: మత్తయి 28:1-6

ఉత్థాన క్రీస్తు పాపము, మరనములపై శక్తిని కలిగియున్నాడని నిరూపించాడు. యేసువా! మా పాపమునుండి విముక్తులను చేయండి. మీ వెలుగును, సంతోషమును ఇవ్వండి. ప్రేమ, విశ్వాసము, నమ్మకము, ప్రార్ధనా వరాలను మాలో నింపండి.





2. యేసు మొక్షారోహణం చేయుట (మార్కు 16:19)
పఠనము: లూకా 24:36-51

యేసు ప్రభువా! బాధలోనున్న మీ అపోస్తలులను మీరు చేయివిడనాడలేదు. 40 దినాలలో సంపూర్ణమైన సంతోషాన్ని మహిమను వారికి ఒసగియున్నారు. పరలోకమునకు కొనిపోబడిన తర్వాత, మిమ్ములను వెదకువారికి దివ్యసత్ప్రసాదమును గొప్పవరమును ఇచ్చియున్నారు. మరియతల్లిద్వారా, మిమ్ములను విశ్వసిస్తున్నాము. విశ్వాసమను వరమును దయచేయండి.




3. పవిత్రాత్మ అపోస్తలులపై వేంచేయుట (అ.కా. 2:4)
పఠనము: అ.కా. 2:1-4

యేసు మనలను ఒదార్చువారైన పవిత్రాత్మతో నింపుచున్నాడు. ప్రభువా! మీ పవిత్రాత్మతో మా హృదయాలను వెలుగుతో నింపి, బలపరచి మమ్ములను స్వస్తపరచండి. మమ్ములను రక్షించి, మా హృదయాలను మీ ప్రేమతో నింపండి. మీ శిష్యులనుగా మమ్ములను చేయండి.




4. మరియమాత దేహాత్మలతో ఉత్థాపితా అగుట (ఆది 3:15)
పఠనము: యూదితు 13:18-20;15:10

మరియ పరలోకమునకు కొనిపోబడియున్నది. ప్రభువు శిలువపై ఉన్నప్పుడు ఆమెకు అప్పజెప్పిన బిడ్డలందరికొరకు ప్రార్ధన చేయును. ఓ మరియమ్మగారా! మాకుసహాయం చేయండి. ఇప్పుడును మా మరణ సమయమందును మాకోసం ప్రార్ధించండి.





5. దేవమాతను ఇహపరలోకాల రాణిగా ప్రకటించుట (దర్శ 12:1)
పఠనము: దర్శన గ్రంధము 12:1

మరియయమ్మయందు మననమ్మకాన్ని ఉంచుదాం. ఆమె సహాయాన్ని, ప్రార్ధన వేడుదలను కోరుకుందాం. ఆమె మన తల్లియేగాక, పరలోకరాజ్ఞి కూడా. జపమాలద్వారా, మరియ ప్రార్ధనల సహాయంద్వారా మనకి సకలం ఒసగబడును. హృదయపూర్వక ప్రార్ధనాయుధాన్నికోరుకుందాం.




వెలుగు దేవరహస్యాలు




1. యేసు యోర్దాను నదిలో యోహానుచేత బప్తిస్మం పొందుట (మత్త 3:17)
పఠనము: మత్తయి 3:13-17

మొట్ట మొదటిగా, యోర్దాను నదిలో యేసు బప్తిస్మము పొందటం ఒక వెలుగు దేవరహస్యం. ''క్రీస్తు పాపరిహితుడు. కాని దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను'' (2 కొరింతీ 5:21). అలా, నీతిమంతుడు, మనకోసం పాపముగా మారిన క్రీస్తు నీటిలోనికి దిగి బప్తిస్మము పొందియున్నప్పుడు ఆకాశము తెరువబడి దేవుని ఆత్మ పావురము రూపమున ఆయనపై దిగివచ్చెను. అప్పుడు ఆకాశము నుండి దివ్యవాణి ''ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయనను గూర్చి నేను ఆనందించు చున్నాను'' అని వినిపించెను.



2 . కానాపల్లె పెండ్లిలో యేసు నీటిని ద్రాక్షరసంగా మార్చుట (యోహాను 2:12)
పఠనము: యోహాను 2: 1-12

కానా పల్లెలోని పెండ్లిలో యేసు చేసిన మొదటి అద్భుతము రెండవ వెలుగు దేవరహస్యము. నీటిని ద్రాక్షరసముగామార్చి శిష్యుల హృదయాలను తెరచి వారిలో విశ్వాసాన్ని నింపియున్నాడు. మరియ తన కుమారున్ని పూర్తిగా విశ్వసించింది. ఆ సందర్భములో ఆమె చేసిన వేడుదలకు మనం ఎంతో కృతజ్ఞులం.




3. యేసు దైవరాజ్యమును, హృదయపరివర్తనమును ప్రకటించుట (మార్కు 1:14-15)
పఠనము: మార్కు 1:15

యేసు దైవరాజ్యముగూర్చి భోదించాడు. అది సమీపించినదని, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపండి అని భోదించాడు. ఇదేభోదన, లోకాంతమువరకు కొనసాగును. ముఖ్యముగా, పాప సంకీర్తనము అను దివ్య సంస్కారముద్వారా ఇది కొనసాగును.





4. యేసు పర్వతంపై దివ్యరూపం ధరించుట (లూకా 9:29)
పఠనము: లూకా 9: 28-35

యేసు దివ్యరూపధారణ చాలా ప్రాముఖ్యమైన వెలుగు దేవరహస్యము. దివ్యరూపధారణ తాబోరు పర్వతముపై జరిగిందని మన విశ్వాసం. అచ్చట యేసు ముఖరూపము మార్పుచెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. దివ్యరూపధారణ రాబోవు శ్రమలకు సిద్ధమగుటకు, ఆవిధముగా శ్రమల వలన కలుగు ఉత్థాన సంతోషమునకు బాటలు వేస్తున్నది.




5. యేసు పాస్క పరమరహస్యమైన దివ్యసత్ప్రసాదమును స్థాపించుట (యోహాను 13:1)
పఠనము: మార్కు 14:22-25

యేసు దివ్య సత్ప్రసాదమును స్థాపించుట, చివరి వెలుగు దేవ రహస్యం, యేసు తన శరీరరక్తములను, రొట్టె ద్రాక్ష రసములలో మనకోసం అర్పిస్తున్నారు. దివ్య సత్ప్రసాదం మన ఆత్మకు దివ్య ఔషదం. ఇదంతయు మానవాళి రక్షణకొరకు ఆయన చేసిన గొప్ప త్యాగం.





ఫాతిమా ప్రార్ధన 


ఓ నా యేసువా! మా పాపాలు మన్నించండి. మమ్ము నరకాగ్నినుండి కాపాడండి. ఆత్మలన్నింటినీ, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వాటిని మోక్షమునకు తీసుకొని పొండి. ఆమెన్. 

కృపారసముగలమాత జపం 


కృపారసముగల మాతవై యుండెడు రాజ్ఞీ! వందనము మా జీవమా! మా మధురమా! మా శరణమా! వందనము పరదేశులమై యుండెడు మేము ఏవ యొక్క బిడ్డలము మిమ్ము చూచి మొరపెట్టుచున్నాము ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి యేడ్చేడు మేము మిమ్ము చూచి నిట్టూర్పు విడుచుచున్నాము అందువలన మా కొరకు మనవి చేసెడు తల్లీ! మీ దయారసముగల కన్నులను మా మీదకు త్రిప్పనవదరించండి. ఇదిగాక ఈ పరదేశము గడచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలమగు యేసునాధుని ప్రత్యక్షమైన దర్శనమును మాకివ్వ నవదరించండి. కృపగల తల్లీ! దయారసముగల తల్లీ! ఓ మధురమైన కన్యమరియమ్మా! ఆమెన్. 

దేవమాత ప్రార్ధన 


ఏలినవారా! దయచూపండి ఏలినవారా! దయచూపండి
క్రీస్తువా దయచూపండి క్రీస్తువా దయచూపండి
ఏలినవారా! దయచూపండి ఏలినవారా! దయచూపండి
క్రీస్తువా! మా ప్రార్ధన విన నవదరించండి క్రీస్తువా మా ప్రార్ధన ప్రకారం దయచేయండి.
పరలోక మందుండేడు పితయైన సర్వేశ్వరా! మా మీద దయగా నుండండి స్వామి.
లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వరా!మా మీద దయగా నుండండి స్వామి.
పవిత్రాత్మ సర్వేశ్వరా! మా మీద దయగా నుండండి స్వామి.
పరిశుద్ధ మరియమ్మా! మా కొరకు వేడుకొనండి.
సర్వేశ్వరుని మాతా!  మా కొరకు వేడుకొనండి.
కన్యకల పరిశుద్ధ కన్యకా!  మా కొరకు వేడుకొనండి.
క్రీస్తుని మాతా!  మా కొరకు వేడుకొనండి.
శ్రీసభ మాతా!  మా కొరకు వేడుకొనండి.
దేవ వరప్రసాద మాతా!  మా కొరకు వేడుకొనండి.
మహా పరిశుద్ధ మాతా!  మా కొరకు వేడుకొనండి.
మహా విరక్తిగానుండెడు మాతా!  మా కొరకు వేడుకొనండి.
నిర్మలమైన మాతా!  మా కొరకు వేడుకొనండి.
కన్యత్వము చెడని మాతా!  మా కొరకు వేడుకొనండి.
స్నేహమునకు తగిన మాతా!  మా కొరకు వేడుకొనండి.
మహా స్తుతికి పాత్రమైన మాతా!  మా కొరకు వేడుకొనండి.
మంచి ఆలోచన మాతా!  మా కొరకు వేడుకొనండి.
సృష్టి కర్త మాతా!  మా కొరకు వేడుకొనండి.
రక్షకుని మాతా!  మా కొరకు వేడుకొనండి.
మహా వివేకముగల కన్యకా!  మా కొరకు వేడుకొనండి.
మహా పూజ్యమైన కన్యకా!  మా కొరకు వేడుకొనండి.
స్తుతికి యోగ్యమైన కన్యకా!  మా కొరకు వేడుకొనండి.
శక్తిగల కన్యకా!  మా కొరకు వేడుకొనండి.
దయగల కన్యకా!  మా కొరకు వేడుకొనండి.
విశ్వాసముగల కన్యకా!  మా కొరకు వేడుకొనండి.
ధర్మము యొక్క అద్దమా!  మా కొరకు వేడుకొనండి.
జ్ఞానము యొక్క ఆలయమా!  మా కొరకు వేడుకొనండి.
మా సంతోషమునకు కారణమా! మా కొరకు వేడుకొనండి.
జ్ఞానా పాత్రమా!  మా కొరకు వేడుకొనండి.
మహిమకు తగిన పాత్రమా!  మా కొరకు వేడుకొనండి.
అత్యంత భక్తియొక్క పాత్రమా!  మా కొరకు వేడుకొనండి.
దేవరహస్యముగల రోజా పుష్పమా!  మా కొరకు వేడుకొనండి.
దావీదుని గోపురమా!  మా కొరకు వేడుకొనండి.
దంతమయమైన గోపురమా!  మా కొరకు వేడుకొనండి.
స్వర్ణమయమైన ఆలయమా!  మా కొరకు వేడుకొనండి.
వాగ్దత్తము యొక్క మందసమా!  మా కొరకు వేడుకొనండి.
మోక్షము యొక్క వాకిలీ!  మా కొరకు వేడుకొనండి.
ఉదయకాల నక్షత్రమా!  మా కొరకు వేడుకొనండి.
వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా!  మా కొరకు వేడుకొనండి.
పాపాత్ములకు శరణమా!  మా కొరకు వేడుకొనండి.
కష్టపడెడు వారలకు ఆదరువా!  మా కొరకు వేడుకొనండి.
క్రీస్తువుల సహాయమా!  మా కొరకు వేడుకొనండి.
సన్మనస్కుల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
పితరుల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
ప్రవక్తల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
అపోస్తలుల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
వేదసాక్షుల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
స్తుతీయుల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
కన్యకల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
సకల పునీతుల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
జన్మ పాపములేక ఉద్భవించిన రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
మోక్షమునకు గొంపోబడిన రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
పరిశుద్ధ జపమాల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
సకల కుటుంబముల రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
సమాధానము యొక్క రాజ్ఞీ!  మా కొరకు వేడుకొనండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్లా! లోకము యొక్క పాపాలను పరిహరించెడువారా! మా పాపాలను మన్నించండి స్వామీ!
సర్వేశ్వరుని గొర్రెపిల్లా! లోకము యొక్క పాపాలను పరిహరించెడువారా! మా ప్రార్ధన విన నవధరించండి స్వామీ!
సర్వేశ్వరుని గొర్రెపిల్లా! లోకము యొక్క పాపాలను పరిహరించెడువారా! సర్వేశ్వరుని పరిశుద్ధమాతా మాకొరకు ప్రార్ధించండి.

ప్రార్దించుదము: జగద్రక్షకుడైన యేసువా! మీ స్లీవక్రింద నిలిచియుండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే!ఇదిగో! మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి, దేవరవారు కాలప్రమాణమందును నిజమైన మనుష్యుడై జన్మించనున్నట్లును తెలిసికొనునటువంటి అమ్మయొక్క బిడ్డలుగా నుండెడు భాగ్యము మాకు ఎప్పటికిని ప్రాప్తింప అవధరించండి స్వామీ! ఆమెన్. 

దివ్య కరుణామూర్తికి భవ్య ఆరాధన 


మద్యాహ్నం 3 గం.ల ప్రార్ధన 
మాకొరకు మృతిచెందిన యేసుప్రభువా! ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెల్లుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా! ఎడతెగని దైవకృపా! విశ్వ ప్రపంచాన్ని ఆవరించి, నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమెన్. 
యేసు తిరుహృదయమునుండి, జీవ ఊటవలె, ప్రవహించు దివ్యరక్తమా! 
జీవ జలమా! మిమ్ము నమ్ముచున్నాను. 

దివ్య కరుణామూర్తికి జపమాల 


పరలోక జపం మంగళవార్త జపం త్రిత్వస్తోత్రం విశ్వాస సంగ్రహము 
నిత్య పితా! మీ దివ్య కుమారుడును, మా నాధుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర, రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహార్ధము, సకల మానవుల పరిహార్ధము మీకు సమర్పించు చున్నాము (పెద్ద పూసలు) (మంగళవార్త జపము చెప్పే పూసలపై ఈ క్రింది జపం చెప్పాలి) 

దు:ఖపూరితమైన యేసు నాధుని శ్రమలు, మరణము ద్వారా, మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్దుడను, సర్వశక్తి మంతుడను, నిత్యుడునైన దేవా! మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. 

శాంతి ప్రార్ధన 


శాంతి సాధనగా, మీ నిత్యశాంతి సాధనగా, నన్ను చేయుమోప్రభూ! నన్ను చేయుమోప్రభూ! ద్వేషమున్నచోట ప్రేమను, పాపమున్నచోట క్షమాపణను అవిశ్వాసమున్నచోట విశ్వాసమును నిరాశ యున్నచోట ఆశను చీకటియున్నచోట కాంతిని చూపనిమ్ము ప్రభూ! చూపనిమ్ము. ఓ ఏలినవారా! సానుభూతి కాశింపక, సానుభూతి చూపనిమ్ము పరులు నన్ను తెలియకాదు, పరులు నాకు తెలియనిమ్ము పరుల ప్రేమకాశించక, పరుల నెప్పుడు ప్రేమించనిమ్ము కృంగిపోవు మానవులకు సహాయం చేయు శక్తినిమ్ము అంధకార బంధితులకు వెలుగు చూపనిమ్ము దు:ఖదూరిత జీవులకు సుఖశాంతులు పంచనిమ్ము పరుల పాపక్షమాపణలోనే క్షమాభిక్ష పొందనిమ్ము మరణమొందునప్పుడే మోక్షం మనకు సంసిద్ధం.